పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగం

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

చిట్యాల: మండల కేంద్రంలో కొంతకాలం నుంచి పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగంగా ఉంది. దీంతో పాడి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు మండలంలోని గుంటురుపల్లి, నవాబుపేటతో పాటు పలు గ్రామాలలో పాడి రైతులు సుమారు వందల లీటర్ల పాలను తీసుకుని పరకాల, హనుమకొండ పట్టణాలకు తరలించి అమ్ముకునేవారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో 2002 జనవరిలో పాలశీతలికరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పాడి రైతులు పాలశీతలికరణ కేంద్రానికి పాలను తీసుకవచ్చి విక్రయించి అబ్ధిపొందేవారు. ఈ విధంగా మూడు సంవత్సరాలు సాఫీగా కొనసాగింది. కాలక్రమేణ పాలశీతలికరణ కేంద్రంకు పాలు అనుకున్నట్లు రావడం లేదనే సాకుతో అప్పటి సంబంధిత అధికారులు ములుగుకు తరలించినట్లు రైతులు తెలిపారు. కాగా, రైతుల విజ్ఞప్తి మేరకు మరికొన్ని నెలలు నామామాత్రంగా పాలశీతలికరణ కేంద్రాన్ని నడిపించుకుంటూ ఓ వాహనంలో పాలసేకరణ చేపట్టి అధికారులు చేతులు దులుపుకున్నట్లు పేర్కొటున్నారు. దీంతో పాలశీతలికరణ కేంద్రంలో ఉన్న యంత్రాలు మూలన పడి తుప్పుపట్టి పోయాయి.

ఆర్థికంగా నష్టపోతున్న పాడి రైతులు

ప్రభుత్వాలు మహిళా సంఘాలకు పాడి రైతులకు రుణాలు అందజేసి వాటి ద్వారా పాడి గేదెలను కొనుగోలు చేయించేవి. దీంతో రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాలను విక్రయిస్తూ బ్యాంకు రుణాలు పోను ఆర్థికంగా బలపడేవారు. మండల కేంద్రంలోని పాలశీతలికరణ కేంద్రం మూతపడడంతో పాలను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతూ తక్కువ ధరకు పాలను అమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టి మండల కేంద్రంలో పాలశీతలికరణ కేంద్రాన్ని పునర్‌ప్రాంభించాలని పలు గ్రామాల పాడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉపాధి కోల్పోతున్న పాడి రైతులు

పట్టించుకోని అధికారులు

పునర్‌ప్రారంభించాలి

మండల కేంద్రంలో కొంత కాలం క్రితం మూతపడిన పాలశీతలికరణ కేంద్రాన్ని అధికారులు పునర్‌ప్రారంభించాలి. నేను ప్రతి రోజు పది లీటర్ల పాలను పట్టణాలకు పంపుతూ ఇబ్బందులు పడుతున్నా. మండల కేంద్రంలో పాలశీతలికరణ కేంద్రం ఉంటే ఏలాంటి ఇబ్బంది ఉండదు. అధికారులు, పాలకులు స్పందించి పాలకేంద్రాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలి.

– కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. పాడిగేదెల రైతు, నవాబుపేట

Advertisement
 
Advertisement
Advertisement