● సర్పంచ్ గురుసింగబాబు
కాళేశ్వరం: గ్రామాల అభివృద్ధి, సమాజ ప్రగతి సాధించాలంటే విద్యే ప్రధాన మార్గమని చండ్రుపల్లి సర్పంచ్ గురుసింగబాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు బుధవారం మహదేవపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ అధ్యక్షతన వివిధ గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు విద్యార్థుల నమోదు ప్రక్రియ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య ప్రాధాన్యతపై చర్చించారు. అనంతరం సర్పంచ్ గురు సింగబాబు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని సర్పంచ్‌లు తమ గ్రామాల విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేలా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో మండల కేంద్రంలో 2008 సంవత్సరంలో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అన్నారం సర్పంచ్ నీర్ల ప్రభాకర్, మద్దులపల్లి సర్పంచ్ వేల్పుల సరిత, పలుగుల సర్పంచ్ విజయలక్ష్మి, మెట్‌పల్లి ఉప సర్పంచ్ రాజు, వివిధ గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో చేరాలి
మల్హర్: పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ కళాశాలలో చేరాలని సర్పంచ్ బండి స్వామి కోరారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం జూనియర్ కళాశాల అధ్యాపకులతో కలిసి సర్పంచ్ బండి స్వామి విద్యార్థులకు, వారి తల్లిద్రండులకు అవగాహన కల్పించారు. ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యంగా విద్యార్థినుల తల్లిదండ్రులు అమ్మాయిలను తప్పకుండా పైచదువులు చదివించాలన్నారు. చదువు మానేయకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు పొందినందుకుగాను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయదేవిని, అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


