భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి

Mar 26 2026 7:53 AM | Updated on Mar 26 2026 7:53 AM

భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి కొడవటంచ ఆదాయం రూ.23.12 లక్షలు దరఖాస్తు గడువు పెంపు జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు

న్యూస్‌రీల్‌

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీల్లోని లెక్కించగా రూ.23.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్‌ తెలిపారు. కోటంచ దేవస్థానంలో వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 28 గ్రాములు, మిశ్రమ వెండి 1.3 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ సావటి మెగిళి, జీపీఓ రవీందర్‌, ఆలయ సిబ్బంది రవీందర్‌, శ్రావణ్‌, సుధాకర్‌, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి, కొడవటంచ భజన బృందాలు పాల్గొన్నారు.

ప్రమాద బీమా

చెక్కు అందజేత

భూపాలపల్లి అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్‌ నేరుపాటి మొగిలి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును బుధవారం అందజేసినట్లు బ్రాంచీ మేనేజర్‌ రామస్వామి తెలిపారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ, సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదగా బ్యాంక్‌ ఆవరణలో చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం విశేషమని తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ఇంకా సుమారు 60 మంది ఉద్యోగులు ఈ సౌకర్యం లేని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని, వారు ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకుల్లోని కార్పొరేట్‌ శాలరీ ఇన్సూరెన్స్‌ పథకంలోకి మారాలని సూచించారు. గనులు, విభాగాల వారీగా ఖాతాలు మార్చుకోవాల్సిన వారి సంఖ్యను వివరించారు. డిపార్ట్‌మెంట్లలో 12 మంది, కేటీకే–1లో 12 మంది, కేటీకే–5లో 9 మంది, కేటీకే–6లో 13 మంది, కేటీకే–8లో 8 మంది, కేటీకే ఓసీ–2లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌, కావూరి మారుతి, సెక్యూరిటీ ఆఫీసర్‌ మురళీమోహన్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌, ఐఎన్‌టీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

భూగర్భ జలాల అభివృద్ధి, వినియోగంపై అవగాహన

భూపాలపల్లి రూరల్‌: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జల శాఖ అశ్రీత ఎన్జీఓ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం నాగారంలో గ్రామంలో బుధవారం ప్రజలు, రైతులకు నీటి ప్రాముఖ్యత, వినియోగం అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు కాలే.కుమార్‌, మండల రాజయ్యను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా భూగర్భజల శాఖ అధికారులు శ్రీనివాసరావు, విక్రమ్‌, వ్యవసాయ శాఖ అధికారులు సతీష్‌ కుమార్‌, ఉద్యానవన శాఖ ఏఈఓ సుమలత, మిషన్‌ భగీరథ ఇన్‌చార్జ్‌ సాయి, ఎలిగేషన్‌ విభాగం ఏఈఓ క్రాంతి, సర్పంచ్‌ అంబాల దుర్గమ్మ, మాజీ సర్పంచ్‌ నాంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఉపసర్పంచ్‌ సెగ్గం మల్లేష్‌, అంబాల జగదీష్‌ పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్‌, హైదరాబాద్‌ ద్వారా 2025–26 ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుంచి వివిధ ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడుపు పెంచినట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంఘం చైర్మన్‌, బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 671 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.

భూపాలపల్లి: భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్‌ సమగ్రంగా పరిశీలించి నివేదికలను అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూ వివాదాల విషయంలో సంయుక్త సర్వేలు నిర్వహించి హద్దులను నిర్ణయించాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలి

తాడిచర్ల నుంచి కేటీపీపీ వరకు ఏర్పాటు చేయనున్న కన్వేయర్‌ బెల్ట్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో నెగోషియేషన్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులకు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, కేటీపీపీ ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టు పురోగతిని, భూ సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టు అమలులో భాగంగా ప్రభావితం అవుతున్న రైతుల సమస్యలను పరిగణించి, వారికి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, చట్ట బద్ధంగా కొనసాగాలని, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

మరింత చేరువలో బ్యాంకింగ్‌ సేవలు

బ్యాంకింగ్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో భూపాలపల్లిలోని మంజూరునగర్‌లో కొత్తగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ ప్రారంభించినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. బుధవారం ఎస్‌బీఐ బ్రాంచ్‌ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం తిరుపతి, ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి

మల్హర్‌(కాటారం): విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. మండలంలోని మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థుల వసతి గహం, భోజన శాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల వసతి గృహం నిర్వహణ, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల పరిస్థితి తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, బోధనా నాణ్యత మెరుగు, వసతి గృహాల్లో శుభ్రత పాటించడం, పోషకాహారం సమయానికి అందించడం వంటి విషయాల్లో సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాబు, నాయాబ్‌ తహసీల్దార్‌ రామ్మోహన్‌, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులతో ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్‌ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్‌ ట్యాంక్‌ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎస్పీ సంకీర్త్‌ తెలిపారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement