మల్హర్(మహాముత్తారం): గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం మండలంలోని మహాముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు 6,200 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్‌కు కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు కొనసాగిస్తామని వెల్లడించారు. యశోద హాస్పిటల్ (హైదరాబాద్), ఏకశిల హాస్పిటల్ (హనుమకొండ), సిగ్మా హాస్పిటల్, కూరపాటి హాస్పిటల్స్, శరత్ లేజర్ ఐ కేర్ (హనుమకొండ), భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మొత్తం 34 మంది వైద్యులు 9 విభాగాల్లో సేవలు అందించాని ఎస్పీ వివరించారు. ఈ శిబిరంలో గుండె, మూత్రపిండాలు, జనరల్ మెడిసిన్, సీ్త్ర వ్యాధులు, కంటి, చర్మ, చెవి–ముక్కు–గొంతు, ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అలాగే అదనంగా రక్త పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎసైలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో
పోలీస్ మెగా మెడికల్ క్యాంప్
6,200 మంది గిరిజనులకు చికిత్స


