భూపాలపల్లి: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. సరస్వతి అంత్య పుష్కరాల పనులపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, పీఆర్, మిషన్ భగీరథ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెడ్‌లైన్ ప్రకారం జాప్యం లేకుండా కచ్చితంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గాలికుంటుపై అప్రమత్తంగా ఉండాలి..
జిల్లాలోని పశుపోషకులు గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రచార రథాన్ని, కర పత్రాలను ఆవిష్కరించారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 55 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
ప్రతిపాదనలు పంపాం..
2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, దేవాదాయ తదితర శాఖల ద్వారా చేపట్టనున్న పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులపై హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో సోమవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


