బీపీ.. షుగర్‌ | - | Sakshi
Sakshi News home page

బీపీ.. షుగర్‌

Mar 22 2026 1:36 AM | Updated on Mar 22 2026 1:36 AM

జీవనశైలి మార్పుతో దీర్ఘకాలిక వ్యాధులు

నలుగురిలో ఒకరికి బీపీ.. ఐదుగురిలో ఒకరికి మధుమేహం

నియంత్రణ కోసం వైద్యారోగ్య శాఖ చర్యలు

పల్లెల్లోనూ పెరుగుతున్న కేసులు

జిల్లా జనాభా : 4.50లక్షలు

(2011 జనాభా లెక్కల ప్రకారం)

ఎన్‌సీడీ ద్వారా స్క్రీనింగ్‌ 1,40,000

బీపీ వ్యాధిగ్రస్తులు

27,660

షుగర్‌ వ్యాధిగ్రస్తులు

12,245

భూపాలపల్లి అర్బన్‌: ప్రస్తుతకాలంలో దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి.. ఇలా పలు కారణాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్‌(మధుమేహం) బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జబ్బుల బారిన పడేవారు. ప్రస్తుతం పల్లెల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్‌ ఉందంటే పరిస్థితి తీవ్రత అంచనా వేయవచ్చు. ఈ స్థాయిలో బీపీ, మధుమేహ బాధితులు ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేకపోవడంతో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మృత్యువాత పడుతున్నారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితం గడపవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యోగాతో పాటు వ్యాయామం చేస్తే ఒత్తిడిని జయించవచ్చంటున్నారు. సమీకృతాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఎన్‌సీడీ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్‌, మహిళలకు రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్‌కు సంబంధించి పరీక్షలు చేస్తున్నారు. మూడో విడతలో ఇప్పటివరకు లక్షా 40వేల మందికి స్కీన్రింగ్‌ చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో 27,660 మంది బీపీ, 12,245 మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి మహిళలు దాదాపు 382 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్క్రీనింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

వీటితో నష్టాలు..

బీపీ, షుగర్‌ వల్ల జనం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన శైలితోనే 90 శాతం మందికి బీపీ వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రైమరీ, సెకండరీ హైపర్‌టెన్షన్‌ ఉంటుంది. బీపీతో గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, శరీరంలోని ఇతర అవయవాలు చెడిపోవడం, కంటి సమస్యలు రావడం, రక్తం గడ్డకట్టడంతో పక్షవాతం వస్తుంది. బీపీ ఎక్కువై నరాలు చిట్లిపోయి చనిపోతున్నారు. షుగర్‌ వల్ల నరాలు బలహీనమవడం, కాళ్లకు తిమ్మిర్లు రావడం, కిడ్నీలు చెడిపోవడం, కంటి సమస్యలు, శరీరంలో అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్‌ రావడం, రోగనిరోధక శక్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 30ఏళ్లు పైబడిన వారికి షుగర్‌ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్యాంక్రియాస్‌ గ్రంథి ఇన్సులెన్‌ రిలీజ్‌ చేయకపోవడంతో షుగర్‌ పెరిగి డయాబెటిస్‌కు దారి తీస్తుందంటున్నారు. ఇక రొమ్ము క్యాన్సర్‌ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల సర్వైకల్‌ క్యాన్సర్‌ లైంగిక సంబంధాలతో వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం..

ఎన్‌సీడీ ప్రోగ్రాంలో భాగంగా బీపీ, షుగర్‌, రొమ్ము, సర్వైకల్‌, నోటి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం. బీపీ, షుగర్‌ ఉన్నవారికి నెలనెలా మందులను పంపిణీ చేస్తున్నాం. క్యాన్సర్‌ అనుమానాలు, లక్షణాలు కనిపిస్తే స్థానికంగా ప్రాథమిక నిర్ధారణ చేసి రొమ్ము, ఇతర క్యాన్సర్‌ను గుర్తించేందుకు పెద్ద ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నాం. జీవనశైలితో వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాయామంతో రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

– డాక్టర్‌ మధుసూదన్‌,

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement