ఏఐ శిక్షణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఏఐ శిక్షణ పూర్తి

Mar 22 2026 1:36 AM | Updated on Mar 22 2026 1:36 AM

భూపాలపల్లి: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం మసూరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ విజయవంతంగా పూర్తి చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు నిర్వహించిన ‘డిజిటల్‌ రూపాంతరణ కోసం ఏఐ చాంపియన్స్‌ ప్రోగ్రాం’లో రాహుల్‌ శర్మ పాల్గొన్నారు. భవిష్యత్‌లో జిల్లాలో పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ ఉపయోగపడనుంది. రాష్ట్రం నుంచి ఎంపికై న కలెక్టర్లలో రాహుల్‌ శర్మ ఒకరు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఏఐ శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రం నుంచి ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణ కార్యక్రమానికి తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఆధునిక సాంకేతికతలను వినియోగించి ప్రజాసేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

గెలుపోటములు సహజం

భూపాలపల్లి అర్బన్‌: క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కృష్ణకాలనీ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం జీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. గెలిచిన వారు వినయంగా ఉండాలని.. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరింత శ్రమించి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్‌కుమార్‌, సింగరేణి అధికారులు శ్యామ్‌సుందర్‌, శ్రావణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రచారి, కార్యదర్శి రమేస్‌, సభ్యులు శ్రీను, అభి, హేమంత్‌, రాజ్‌కుమార్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

రామప్పలో అమెరికన్లు

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన రోలండో అలెక్టెరియా, రేటా హెంగ్‌లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ వెంకటేశ్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement