ప్రతీ ఒక్కరు ఎన్నికల కోడ్ పాటించాలి
కాళేశ్వరం: స్థానిక ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎస్పీ.. స్వామివారికి అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈఓ మహేష్ ఎస్పీని సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించి నిఘా మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ఆయన వెంట మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
నియమావళిని ఉల్లంఘిస్తే
చర్యలు తప్పవు
ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా
ఓటుహక్కును వినియోగించుకోవాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాళేశ్వరాలయంలో పూజలు


