ముగిసిన తేనెటీగల పెంపకంపై శిక్షణ
కాటారం: జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ తేనెటీగల బోర్డు సారథ్యంలో కాటారం వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజులపాటు నిర్వహించిన తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించారు. శ్రీ నేచురల్ హనీ వ్యవస్థాపకురాలు తాళ్లపెల్లి సంజన–రఘుతోపాటు వివిధ ప్రైవేట్ సంస్థల నిపుణులు శిక్షణలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తేనెటీగల వర్గీకరణ, తేనెటీగ పెట్టె, ఉపకరణాల గుర్తింపు, కాలనీ నిర్వహణ, కాలానుగుణంగా నిర్వహణ, తేనె సంగ్రహణ, వ్యాధి, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ అందించారు. రైతులు తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని పలువురు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లికార్జున్, బొమ్మన భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


