పల్లెపోరుకు సై..
భూపాలపల్లి: పల్లెపోరుకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ తెలిపి షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈసీ ప్రకటనతో ఓవైపు జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవగా, గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
రెండు డివిజన్‌లు.. మూడు విడతలు..
జిల్లాలోని భూపాలపల్లి, కాటారం రెవెన్యూ డివిజన్‌లలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి రేపటి(గురువారం) నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా, డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. రెండవ విడత ఎన్నికలు డిసెంబర్ 14, మూడవ విడత 17వ తేదీన జరుగనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యుల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
అధికారులు సిద్ధం..
ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పీఓ, ఓపీఓల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ సెంటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ ముందు నుంచే సన్నద్ధంగా ఉన్నారు.
పల్లెల్లో పోటాపోటీ..
గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా రిజర్వేషన్ల వివాదం కోర్టుకెక్కి ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈసారి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం.. పంచాయతీ ఎన్నికలకు వెళ్తుండటంతో అవాంతరాలు తలెత్తే అవకాశం లేదు. దీంతో సర్పంచ్, వార్డుస్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ఓవైపు తమ పార్టీ మద్ధతు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, మరోవైపు పల్లె ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పడరాని పాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా స్థానికంలో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడమేకాక స్థానికంగా పట్టు సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి.
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం
మూడు విడతల్లో
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు
అమల్లోకి వచ్చిన కోడ్
జిల్లాలో 248 జీపీలు, 2,102 వార్డులు
పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి
పల్లెపోరుకు సై..
పల్లెపోరుకు సై..


