కొనట్లే..
జిల్లా వివరాలు
● రోజుల తరబడి కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
● తేమ, తాలు పేరిట జాప్యం
● కొనుగోలు చేసింది 239 మెట్రిక్ టన్నులు మాత్రమే..
● ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న అన్నదాతలు
కాటారం: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినప్పటికీ కాంటాలు మాత్రం కావడం లేదు. రైతులు రోజుల తరబడి తమ ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తేమ, తాలు పేరుతో కొనుగోలు చేయడానికి జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 239 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పలువురు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మద్దతు ధరతో సంబంధం లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించి నష్టపోతున్నారు.
జిల్లామొత్తం అదే పరిస్థితి..
భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా వరి కోతలు నెలరోజుల క్రితమే ప్రారంభకాగా.. ధాన్యం రైతుల చేతికి వచ్చింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల స్థలంలో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసి ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రాలు ఆరబోసిన ధాన్యంతో కిక్కిరిసి పోతున్నాయి. నిర్వాహకులు తేమ, తాలు పేరిట కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు. తేమ శాతం 17 ఉంటే అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్, ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ నిర్వాహకులు మాత్రం తేమశాతం 14 ఉంటేనే కొనుగోలు చేస్తామని తేల్చిచెపుతున్నారు. కాటారం మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి 10 రోజులకు పైగా కేంద్రాల వద్ద ఉండాల్సి వస్తుంది. రైతుల సమయం వృథా కావడంతో పాటు ఆర్థిక భారం పెరుగుతుంది. ఇవన్నీ కారణాలతో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.
ప్రైవేట్ వైపు మొగ్గు..
ప్రభుత్వం నుంచి సన్నరకం ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2389, బోనస్ రూ.500, దొడ్డు రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2369 అందుతుంది. ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు రైతు నుంచి సన్నరకం ధాన్యం రూ.2300, దొడ్డు రకం ధాన్యం రూ.2100 చొప్పున క్వింటాల్‌కు 2 నుంచి 3 కిలోల తరుగుతో కొనుగోలు చేస్తుండటం రైతులు అధికశాతం ప్రైవేట్ వైపు అమ్మడానికే ఆసక్తి చూపుతున్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతులు బోనస్ రూ.500 నష్టపోతున్నప్పటికీ తప్పనిసరి సరిస్థితుల్లో ప్రైవేట్‌కు విక్రయించక తప్పడం లేదని చెప్పుకొస్తున్నారు.
వరి సాగు 1,11,230 ఎకరాలు
కొనుగోలు కేంద్రాలు 204
ప్రారంభమైనవి 180
ధాన్యం దిగుమతి 2లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాల
ద్వారా సేకరణ లక్ష్యం 1.52 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం
239 మెట్రిక్ టన్నులు
కొనట్లే..


