ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.3.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సీటీ స్కాన్ యంత్రాన్ని మంగళవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాతో పాటు పొరుగున ఉన్న సిరోంచ ప్రాంతం నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారని, ఏదేని ప్రమాదం జరిగితే ప్రజలు వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు సీటీ స్కాన్ సేవలకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆస్పత్రిలో ఇప్పటికే వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రికి 203 పోస్టులు మంజూరు చేయించామని, అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, వైద్యులు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


