మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యం
భూపాలపల్లి: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ద్వారా వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వడ్డీ లేని రుణాలు పంపిణీపై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో మొత్తం 6,037 స్వయం సహాయక సంఘాలకు రూ. 221.73 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు భారీ స్థాయిలో ఆర్థిక సహకారం అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 61 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
రేగొండ(కొత్తపల్లిగోరి) : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాహుల్‌శర్మ పేర్కొన్నారు. కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల్లో డిజిటల్ బోధన వినియోగిస్తున్న విధానాలపై ఉపాధ్యాయలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాఠాలు చదివించి అభినందించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


