గర్భిణుల నరకయాతన
ఎమర్జెన్సీ అయితే
ఎంజీఎం, భూపాలపల్లి..
నిరుపయోగంగా ఉన్న ఆపరేషన్ థియేటర్
● గైనకాలజిస్టు లేక ఇబ్బందులు
● సేవలకు జిల్లాకేంద్రమే దిక్కు..
● పట్టించుకోని పాలకులు, అధికారులు
చిట్యాల: ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందిన చిట్యాల సివిల్ ఆస్పత్రి ఇప్పుడు గైనకాలజిస్ట్ లేక గర్భిణులు, బాలింతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సేవలకు జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి వెళ్తూ ప్రయాణంలో నరకయాతన పడుతున్నారు. గైనకాలజిస్ట్ లేక నెలలు గడుస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
సమీక్షలకే పరిమితం..
సివిల్ ఆస్పత్రిలో ఆస్పత్రి వైద్య బృందం, సిబ్బందితో మే 12న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి, వైద్యుల నియామకానికి కృషి చేస్తానని చెప్పారు. సమీక్ష నిర్వహించి ఏడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికై నా ఆస్పత్రి సమస్యలను పరిష్కరిస్తే పేద ప్రజలకు స్థానికంగా వైద్యం అందే అవకాశం ఉంటుంది.
ప్రతిపక్షమూ పట్టించుకోవట్లే..
జూలైలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలను పూర్తి స్థాయిలో రోగులకు అందించాలని.. గైనకాలజిస్టుని నియమించకుంటే బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి దీక్ష చేస్తామని చెప్పారు. చెప్పి ఐదు నెలలైనా ఇప్పటి వరకు మరోసారి ఆస్పత్రి కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాలేదు. నాయకులు రాజకీయాల కోసం ఆస్పత్రి సమస్యలను వాడుకుంటున్నారే తప్ప నిజంగా ఆస్పత్రి అభివృద్ధి కోసం కాదని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన. సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లో డాక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. గతంలో వలే నాణ్యమైన వైద్యసేవలను పేదలకు అందిస్తాం.
– డాక్టర్ శ్రీకాంత్,
చిట్యాల సివిల్ ఆస్పత్రి
సూపరింటెండెంట్
నా కోడలుకు ఆరు రోజుల కిత్రం పురుటి నొప్పులు రావడంతో భూపాలపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లాము. అక్కడికి వెళ్లేందుకు సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది. డెలివరీ అయి తిరిగి వస్తున్నప్పుడు తల్లీబిడ్డలతో ప్రయాణంలో ఇబ్బంది పడుతూ వచ్చాం. చిట్యాలలో డాక్టర్ ఉంటే బాగుండు. ఇప్పటికై నా ఏర్పాటుచేస్తే గర్భిణులకు ఉపయోగం ఉంటుంది.
– కొలిపాక శారద, పెద్దంపల్లి, టేకుమట్ల
●
చిట్యాల సివిల్ ఆస్పత్రికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడానికి అప్పటి వైద్యాధికారి రవిప్రవీన్‌రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ స్నిగ్ధసంస్కృతి ప్రత్యేక కృషి చేశారు. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో సీ్త్రల వైద్య నిపుణులు లేక టేకుమట్ల మండలంలోని వెలిశాల, ఒడితల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల గర్భిణులు, బాలింతలను 102లో జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. పేరుకే పెద్దాస్పత్రి కానీ డాక్టర్ లేరని, నిత్యం వందల మందికి వైద్య సేవలను అందించే ఆస్పత్రిలో పరికరాలు సైతం మూలాన పడడంతో అత్యవసర సమయంలో వచ్చిన రోగులను వరంగల్ ఎంజీఎం, భూపాలపల్లి 100పడకల ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ సైతం నిరుపయోగంగా మారింది.
గర్భిణుల నరకయాతన
గర్భిణుల నరకయాతన
గర్భిణుల నరకయాతన


