బడులకు క్రీడానిధులు
భూపాలపల్లి అర్బన్: క్రీడలు విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. ఆత్మవిశ్వాసం, మానసిక చురుకుదనానికి దోహదం చేస్తాయి. ఈ మేరకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా సర్కారు బడులకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేసింది. ఆటలపై శిక్షణతో పాటు క్రీడా సామగ్రికి వీటిని వెచ్చించనున్నారు.
రెండు విడతల్లో..
పాఠశాల స్థాయిలో క్రీడలకు అవసరమైన నిధులు మొదటి విడతలో 50 శాతం విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు రూ.25 వేల చొప్పున చెల్లించనున్నారు. షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, స్కిప్పింగ్, సాఫ్ట్‌బాల్, టెన్నిస్‌బాల్, వాలీబాల్, హ్యాండ్ బాల్, త్రోబాల్ తదితర ఆటవస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలకు కేటాయించిన స్పోర్ట్స్ గ్రాంట్‌ను గైడ్‌లైన్స్ ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. నిధులతో ఆట స్థలాలు చదును వంటి పనులు చేయించరాదనే ఆదేశాలు ఉన్నాయి. ఆటవస్తువులు కొనుగోలు చేసి ఫొటో తీయాలనే నిబంధనలు విధించారు. గ్రాంట్ సద్వినియోగం చేసుకుని విద్యార్థులను క్రీడాపోటీల్లో ప్రోత్సహించాలని అధికారులు ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాల స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు కావాల్సిన ఆటల పరికరాలు లేకపోవడంతో క్రీడల్లో వెనుకబడి పోతున్నారు. ప్రస్తు తం విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా నిధులు కేటా యించడం శుభ పరిణామం. ఈ విధంగా పాఠశాల క్రీడలకు నిధులు కేటాయించినట్లయితే గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తారు.
– ఎల్.జయపాల్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వం నుంచి పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు కావాల్సిన నిధులు వస్తున్నాయి. వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. క్రీడా పరికరాల కొనుగోలు కోసం వచ్చిన నిధులతో నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించాలి.
– రాజేందర్, జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి
ప్రైమరీ, యూపీఎస్,
ఉన్నత పాఠశాలలకు ఇలా..
జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలల్లో విధ్యార్థులతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లాలో 317 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా పాఠశాలకు రూ.5వేల చొప్పున రూ.15.85 లక్షలు, 44 ప్రాథమికోన్నత పా ఠశాలలకు రూ.10వేల చొప్పున రూ.4.40 లక్షలు, 70 జిల్లా పరిషత్ పాఠశాలలకు రూ.25వేల చొప్పున రూ.17.50 లక్షలు మంజూరయ్యాయి.
మొదటి విడత 50 శాతం మంజూరు
శిక్షణతో పాటు క్రీడాసామగ్రి కొనుగోలు
బడులకు క్రీడానిధులు
బడులకు క్రీడానిధులు
బడులకు క్రీడానిధులు


