మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
● మంత్రి శ్రీధర్‌బాబు
● భూపాలపల్లి, కాటారంలో
ఇందిరమ్మ చీరల పంపిణీ
భూపాలపల్లి రూరల్/కాటారం: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్‌ఆర్ గార్డెన్, కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్‌లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంలో వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, మహిళల పేర్ల మీదనే ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నాని స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. మహిళా సంఘాలకు పాడి పరిశ్రమలకు కృషి చేస్తామని, భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు ఒకటి చొప్పున పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ జరుపుతున్నామన్నారు. కుందూరుపల్లి వద్ద మహిళల కోసం వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు
ప్రత్యేక అధికారుల నియామకం
జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లాలో చీరలు పంపిణీ వైభవంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు రమేష్, మహిళా సమాఖ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సరిత, సుమలత, కోట రాజబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల, దండ్రు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


