ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇందులో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై విధివిధానాలు సూచించారు. ఇప్పటికే కలెక్టర్లతో ఎన్నికల అధికారులు కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారులు శనివారం నుంచి కసరత్తు ముమ్మరం చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. రెండు రోజుల్లోపే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు దూకుడు పెంచగా.. ఉమ్మడి వరంగల్‌లో 1,705 జీపీలు, 15,006 వార్డులకు త్వరలో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు
ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్నందున.. అంతకు ముందే కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు తెలియజేస్తారంటున్నారు. ఈలోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగించేందుకు జీఓ విడుదల కావడంతో అధికారులు తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు 50 శాతం మించరాదని జీఓలో పేర్కొన్నారు. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, కులగణన ఆధారంగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం.
2019లో రిజర్వేషన్లు ఇలా..
2019 పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో 1,708 గ్రామ పంచాయతీలకు 1,664 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 1,664 సర్పంచ్ స్థానాల్లో 1,198 స్థానాల కోసం 2011 జనాభా ప్రకారం కేటాయించారు. 223 షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు కాగా, వంద శాతం ఎస్టీ జనాభా ఉండడంతో 239 స్థానాలను వారికే కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో 115, జనగామలో 37, జేఎస్ భూపాలపల్లి/ములుగులో 6, వరంగల్‌లో 77, హనుమకొండలో 4 గిరిజన పంచాయతీలు ఉన్నాయి. 2019లో బీసీలకు 24 శాతం కోటా కింద 223 స్థానాలు రిజర్వ్ చేశారు. అదే విధంగా అన్ రిజర్వుడ్(యు.ఆర్) 48 శాతం కింద 582 స్థానాలను ఆ కోటాలో కేటాయించారు. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేస్తుండగా.. ఈ నెల 24వ తేదీ వరకు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఏ గ్రామ పంచాయతీ ఎవరికి కేటాయిస్తారో? అనే చర్చ పల్లెలను కుదిపేస్తోంది.
ఉమ్మడి వరంగల్‌లో ఇలా..
జిల్లా సర్పంచ్ పంచాయతీ పోలింగ్
స్థానాలు వార్డులు కేంద్రాలు
హనుమకొండ 210 1,986 1,986
వరంగల్ 317 2,754 2,754
జేఎస్ భూపాలపల్లి 248 2,102 2,102
మహబూబాబాద్ 482 4,110 4,110
ములుగు 171 1,520 1,535
జనగామ 280 2,534 2,534


