నేడు మంత్రి దుద్దిళ్ల పర్యటన
కాటారం: కాటారం, పలిమెల మండలాల్లో నేడు(ఆదివారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటించనున్నారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో నిర్వహించనున్న కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మండలాల ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీతో పాటు కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాలకు సంబంధించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం పలిమెల మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న మండల పరిషత్ కార్యాలయ భవనానికి, లెంకలగడ్డ, దమ్మూరులో నూతనంగా నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన, పలిమెలలో నిర్మించిన జీపీ భవనం ప్రారంభోత్సవం, పలిమెల మండల కేంద్రంలో ఎమ్మార్సీ భవనం, అంగన్‌వాడీ కేంద్రాలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
నల్ల చట్టాలను రద్దుచేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన బ్రిటీష్ కాలం నాటి నల్లచట్టాలను రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ పాత లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌లు తీసుకువచ్చిందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 29 చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్, శ్రీనివాస్, ప్రసాద్‌రెడ్డి, బాపు, జయశంకర్, సాజిత్, నరసింహరెడ్డి, సలీం, మనోజ్ పాల్గొన్నారు.
పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శని, కాలసర్ప నివారణ పూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఆలయంలో శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్బగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి కనిపించింది.
భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు
భూపాలపల్లి రూరల్: గీతా జయంతి పురష్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం–హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాధాకృష్ణ గీతా మందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు టీటీడీ కార్యక్రమ నిర్వాహకులు రామిరెడ్డి కృష్ణమూర్తి బహుమతులు అందించారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ గూడూరు నరేందర్‌రెడ్డి, ఈలపంటి రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు కేటాయించాలి
భూపాలపల్లి రూరల్: బెస్తగూండ్ల గంగపుత్రులకు సంక్షేమ పథకాలు కేటాయించాలని ఆ సంఘం నాయకులు నాగుల అరవింద్ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. మత్స్యశాఖ నుంచి వెలువడుతున్న నిధులను సైతం కేటాయించాలని కోరారు. మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమాల్లో గంగపుత్రుల ప్రతినిధులకు భాగస్వామ్యం చేయాలని కోరారు.
నేడు మంత్రి దుద్దిళ్ల పర్యటన
నేడు మంత్రి దుద్దిళ్ల పర్యటన


