అందని అల్పాహారం..
కాటారం: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో అమల్లోకి తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ ప్రారంభం కావడంతో బ్రేక్ ఫాస్ట్ స్కీం ఉంటే ఉపయోగకరంగా ఉండేది.
పథకం తీరు ఇలా..
జిల్లాలోని 432 ప్రభుత్వ పాఠశాలల్లో 2023 దసరా కానుకగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు 45 నిమిషాల ముందుగా అల్పాహారం అందించే వారు. సోమవారం ఇడ్లీ సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరీ, ఆలూ కూర్మా లేదా టమాట బాత్, సాంబారు, బుధవారం ఉప్మా, సాంబార్ లేదా బియ్యం రవ్వ కిచిడి, చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబర్, శుక్రవారం ఉగ్గని, అటుకులు, చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడి, చట్నీ, శనివారం పొంగల్, సాంబారు లేదా కూరగాయల పలావ్, పెరుగు చట్నీ, ఆలుకుర్మా అందించాలని మెనూలో పొందుపర్చారు. 2024 ఆగస్టు వరకు సక్రమంగా సాగిన అల్పాహారం స్కీంకు ప్రభుత్వం స్వస్తి పలికింది.
నిర్వహణ భారంతో నిలిచిన పథకం..
అల్పాహార పథకం నిర్వహణపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించడంతో నిర్వాహకులకు భారంగా మారి వారు చేతులెత్తేశారు. పథకం ప్రారంభంలో రెండు నెలల బిల్లులు సక్రమంగా విడుదలైనప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా బిల్లులు నిలిచిపోయాయి. అధికారులు, పాఠశాల ఉపాధ్యాయుల ఒత్తిడితో నిర్వాహకులు ఆర్థిక భారం భరిస్తూ విద్యార్థులకు కొన్ని నెలల పాటు అల్పాహారం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అల్పాహారం బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో నిర్వాహకులు ఆర్థిక భారం మోయలేక అల్పాహారం పెట్టడం మానేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం అల్పాహారం పథకం క్రమంగా కనుమరుగైపోయింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నిలిచిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పథకానికి శ్రీకారం
నిధులు లేక నిలిచిన పథకం
మొదలైన టెన్త్ ప్రత్యేక తరగతులు
అయోమయంలో టెన్త్ విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం పాఠశాలకు ముందుగానే వస్తున్నారు. సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ సంగతి పక్కన పెడితే.. సాయంత్రం స్నాక్స్ కూడా అందించే పరిస్థితి కనబడటం లేదు. ఆకలితో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. గతంలో ప్రత్యేక తరగతులకు విద్యాశాఖ ప్రత్యేక నిధులు కేటాయించి స్నాక్స్ అందించింది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ స్నాక్స్ అందజేతపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.


