టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానో పాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో టెన్త్ ఫలితాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు, యుడైస్, ఆధార్, అపార్ జారీ, పాఠశాలల్లో సౌకర్యాల కల్పన తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లా నుంచి 93.55 శాతం ఫలితాలు సాధించామని, ఈ సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు ప్రస్తుతం 68.30 శాతం మాత్రమే ఉండటం బాధాకరమన్నారు. ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉంటే విద్యార్థుల హాజరు ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. గత నెల జరిగిన సమావేశంలో 32 పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్మెంట్ ఉందని, ప్రస్తుతం వాటికి అదనంగా 7 పెరిగి 39 అయ్యాయని పేర్కొంటూ తగ్గాల్సిన సంఖ్య పెరగడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఈఓ రాజేందర్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
‘చిన్న కాళేశ్వరం’పై సమీక్ష..
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువలకు భూసేకరణ, ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రగతిపై శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పంట కాలువల నిర్మాణానికి ఎంత భూమి అవసరం ఉంది.. ఎంత మంది రైతుల భూములు కోల్పోతున్నారు.. ఎన్ని ఎకరాలు అవసరం అవుతుందనే అంశాలపై సమగ్రంగా వివరించారు. పంట కాలువల నిర్మాణానికి ఆటంకాలు లేకుండా వేగంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఎస్డీసీ రమేష్, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


