పేరుకే గ్రంథాలయాలు
● భూపాలపల్లి, మల్హర్ మినహా
జిల్లావ్యాప్తంగా సమస్యలే..
● అద్దె భవనాలు, ఫర్నిచర్ కొరత
● రెగ్యులర్ సిబ్బంది లేక ఇబ్బందులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలలో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. పాలకుల పట్టింపులేనితనం, అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి గ్రంథాలయాలలో మార్పు రావడం లేదు. సొంత భవనాలు, సౌకర్యాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయం, శాఖ గ్రంథాలయాలు తొమ్మిది, గ్రామ గ్రంథాలయం ఒకటి ఉంది. ఒకటి రెండు మినహా మిగతా అన్ని గ్రంథాలయాలు వార్త పత్రికలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు.
అద్దె భవనాలు.. అరకొర సౌకర్యాలు
జిల్లాలో భూపాలపల్లి, తాడిచర్ల, కాటారం, మహదేవపూర్, చెల్పూరు, గణపురం, రేగొండ, చల్లగరిగ, చిట్యాల, మొగుళ్లపల్లి, చిన్నకొడెపాకలలో గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో కాటారం, మహదేవపూర్, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి గ్రంథాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు గ్రామపంచాయతీలోని ఇరుకు గదులలో నడిపిస్తున్నారు. భూపాలపల్లి, తాడిచర్ల గ్రంథాలయాలకు మాత్రమే సరిపడా ఫర్నిచర్, విశాలమైన గదులు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా తొమ్మిది గ్రంథాలయాలకు సౌకర్యాలు కరువయ్యాయి. కూర్చోడానికి కుర్చీలు, బల్లలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గ్రంథాలయంలో 30మంది పాఠకులు కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మాత్రమూ గ్రంథాలయాలను పట్టించుకోవడం లేదు.
వార్తాపత్రికలకే పరిమితం
పాఠకులకు కావలసిన పుస్తకాలు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరాదరణకు గురవుతున్నాయి. గ్రంథాలయాలు కేవలం వార్త పత్రికలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచడం లేదు. చాలా సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన పుస్తకాలు మాత్రమే అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.
సెస్ చెల్లించని గ్రామపంచాయతీలు
గ్రామపంచాయతీ అధికారులు ప్రతి ఏడాది గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఆస్తి పన్నుతో పాటు గ్రంథాలయ సెస్ ఎనిమిది శాతం పన్నును కూడా వసూలు చేస్తారు. గ్రామపంచాయతీ సిబ్బంది వసూలు చేసిన సెస్ చార్జీలను గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ మినహా గ్రామపంచాయతీలు సెస్ చెల్లించడం లేదు. గ్రంథాలయాలకు సెస్ చార్జీల ద్వారానే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతోనే గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సుమారు కోటి రూపాయలపైన సెస్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
సిబ్బంది లేకుండా నిర్వహణ ఎలా..
జిల్లాలో 11 గ్రంథాలయాలు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి గ్రంథాలయానికి గ్రంథ పాలకుడు, ఒక స్వీపర్ ఉండాలి. జిల్లా కేంద్రంలో మాత్రమే సరిపడా రెగ్యులర్ సిబ్బంది ఉన్నప్పటికీ ఐదు గ్రంథాలయాలలో అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్లు ఉండగా, మరో ఐదు గ్రంథాలయాల్లో పార్ట్ టైం స్వీపర్‌లు మాత్రమే పనిచేస్తున్నారు.
పక్కా భవనం నిర్మించాలి..
మండలకేంద్రంలో గ్రంథాలయం అద్దె గదిలో నిర్వహిస్తున్నారు. ఈ గదిలో కూర్చోడానికి కుర్చీలు, బల్లలు కూడా లేవు. పోటీ పరీక్షలకు, విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయడం లేదు. గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన నిధులను వసూలు చేసి గ్రంథాలయం అభివృద్ధి చేయాలి. అధునాతన భవనాన్ని నిర్మించి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.
– సురేందర్, మొగుళ్లపల్లి
కొత్తపల్లిగోరి మండలం చిన్నకొడేపాక గ్రామంలో గ్రామ గ్రంథాలయం పురాతన కాలం నుంచి పెంకుటిల్లులో కొనసాగుతోంది. గ్రంథాలయం అభివృద్ధి చేయాలని పాఠకులు ఏళ్ల తరబడి కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్నా అభివృద్ధి చేయడం లేదు. కనీస సౌకర్యాలు, పుస్తకాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు.
పై ఫొటోలో కనిపిస్తున్నది మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయం. సొంత భవనం లేక అద్దె గదిలో నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు, ఇతర పుస్తకాలు చదువుకునేందుకు లేకపోవడంతో వార్తాపత్రికలకే పరిమితమైంది.
పేరుకే గ్రంథాలయాలు
పేరుకే గ్రంథాలయాలు


