నేడు డయల్ యువర్ సింగరేణి సీఎండీ
భూపాలపల్లి అర్బన్: నేడు (శనివారం) డయల్ యువర్ సింగరేణి సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల వంటి అంశాలపై సింగరేణి సంస్థ చైర్మన్ బలరామ్ శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు పాల్గొని, సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల పెంపుదలకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 040–23311338 నంబర్‌కు కాల్‌చేయాల్సి ఉంటుంది.
డీఈఓ అభినందనలు
భూపాలపల్లి అర్బన్: భూటాన్‌లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ హ్యామర్ త్రో ఆటల పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన టేకుమట్ల మండలం పంగిడిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వంతడుపుల రఘును జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం అభినందించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి సన్మానించారు. పంగిడిపల్లి పాఠశాలలో ఎంఈఓ చిదిరాల సుధాకర్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఘనంగా
ముదిరాజ్ మహాసభ
భూపాలపల్లి రూరల్: ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజ్ మహాసభ ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయినందున ప్రపంచ ముదిరాజ్ దినోత్సవంతో పాటు ముదిరాజ్ మహాసభ వేడుకలు గ్రామ గ్రామాన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఏపార్టీ నుంచైనా ముదిరాజ్ బిడ్డలు పోటీ చేస్తే పార్టీలకతీతంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి పాల్గొన్నారు.
27వరకు వేసెక్టమీ
క్యాంపులు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 27వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న వేసెక్టమీ క్యాంపులను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బందితో శుక్రవారం డీఎంహెచ్‌ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వేసెక్టమీ క్యాంపునకు అధిక సంఖ్యలో తీసుకువచ్చేందుకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతిరోజు మగవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి డాక్టర్ సందీప్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
కేయూలో పలు విభాగాల్లో
తనిఖీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మైక్రోబయోలజీ బయోటెక్నాలజీ విభాగాలను శుక్రవారం ప్రిన్సిపాల్ టి.మనోహర్‌తో కలిసి వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైక్రోబయాలజీ విద్యార్థులతో తరగతులు ఎలా జరగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. బయోటెక్నాలజీ విభాగంలో విద్యార్థులతో మాట్లాడారు. కేయూలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటవుతున్నదని, దీనిని సైన్స్, బయోటెక్నాలజీ విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
నేడు డయల్ యువర్ సింగరేణి సీఎండీ
నేడు డయల్ యువర్ సింగరేణి సీఎండీ


