● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: రెసిడెన్షియల్, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్, వసతి గృహాల ప్రిన్సిపాల్స్, హెచ్‌ఎంలు, ఎస్‌ఓలు, హెచ్‌డబ్ల్యూఓలు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డైట్, కాస్మొటెక్ చార్జీలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. వారంలో మూడు రోజులు తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి ఇందిర, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, వసతి గృహాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
అంత్యపుష్కరాలకు ప్రతిపాదనలు చేయండి
కాళేశ్వరం: వచ్చే ఏడాది మే 21 నుంచి జరుగు సరస్వతినది అంత్యపుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరంలో శాశ్వత హెలిపాడ్ నిర్మాణం చేపట్టాలన్నారు. నంతరం సరస్వతి ఘాటును కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కల్యాణ కట్ట భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుందని త్వరగా పూర్తి చేయాలన్నారు. సరస్వతి మాత విగ్రహం పై కప్పు, ప్లాట్‌ఫామ్ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఈఓ మహేష్, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, విద్యుత్‌శాఖ డీఈ పాపిరెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్ రామారావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, ఇరిగేషన్ డీఈ ప్రకాశ్ పాల్గొన్నారు.
మీసేవకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే మీసేవలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనపర్తి (రేగొండ), గాంధీనగర్ (గణపురం), గర్మిళ్లపల్లి (టేకుమట్ల), అందుకుతండా, గిద్దెముత్తారం (చిట్యాల), జంగేడు, గొర్లవీడు, గొల్లబుద్దారం (భూపాలపల్లి), మహదేవపూర్, దామెరకుంట (కాటారం) ప్రాంతాల్లో కొత్తగా మీసేవ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలి


