నాటు కోళ్లు.. డిమాండ్ బాగు!
మహదేవపూర్ కేంద్రంగా పెంపకం
మహదేవపూర్‌లోని కోళ్లఫారం వద్ద నాటుకోళ్లు
కాళేశ్వరం: తనకు ఇష్టమైన వ్యవసాయంతో పాటు పాడి పెంపకంపై దృష్టి సారించి సహజసిద్ధంగా నాటు కోళ్ల పెంపకంతో మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన రైతు లాభాలు పొందుతున్నాడు. డిమాండ్ బాగా ఉండడంతో అటువైపు దృష్టిసారించాడు. నాటు కోళ్ల మాంసంతో పాటు నాటు కోడిగుడ్ల విక్రయాలు చేసి కోళ్ల పెంపకంపై మక్కువ చాటుతున్నాడు మహదేవపూర్ రైతు.
మొదట కొన్ని కోళ్లతో..
మహదేవపూర్ మండల కేంద్రంలో శ్రీపతి బాపు అనే రైతు ఎకరం భూమి కౌలుకు తీసుకొని నాటు కోళ్లు పెంచుతున్నాడు. ఖర్చు తగ్గించడానికి తడకలతో పందిరి వేసి అందులో చుట్టూర (నెట్) వల, ఫెన్సింగ్ సాయంతో కుక్కలు, కోతులు, పిల్లులు, ముంగీస లాంటివి కోళ్లకు హాని చేసే జంతువులు, క్రిమికీటకాలు దూరకుండా ఫారం రెడీ చేశాడు. విద్యుత్ లైట్లు, నీటిసౌకర్యం ఉంది. అంతకు ముందు తన ఇంటినే కోళ్ల ఫారంగా మలిచి అక్కడ స్థలం సరిపోకపోవడంతో వేరేచోట ఎకరం భూమి లీజుకు తీసుకొని వ్యాపారం సాగిస్తున్నాడు. మొదట కొంచెం నష్టాలు వచ్చినా ఆ తరువాత పుంజుకున్నాడు. దీంతో నిత్యం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫారంలోని కోళ్లపై ప్రత్యేక దృష్టిసారించాడు. ఆ రైతు మొదట కొన్ని నాటు కోళ్లతో ప్రారంభించిన వ్యాపారాన్ని రోజురోజు అభివృద్ధి చేస్తూ ప్రస్తుతం 1500లకు పైగా కోళ్లతో వ్యాపారం పెంపొందించాడు.
సహజమైన దాన..
నాటు కోడిగుడ్లను ఇంక్యుబెటర్‌లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే విధంగా 21 రోజుల్లో కోళ్లు పొదుగు వేస్తారు. గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చిన నాటి నుంచి సహజమైన దాన వేస్తూ..వృద్ధి చేస్తున్నాడు. సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, పొట్టు తదితర దానగడ్డిని వేస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్వరగా పెరిగి దృఢంగా ఉంటాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన కోడి పిల్లకు మాత్రం మొదట ఇంజక్షన్‌లు వాడుతారు. ఆ తరువాత దానపైనే ధృడంగా ఉంటుంది. నెట్, బోనులో ఉంచకుండా స్వేచ్ఛ వాతావరణంలో తిరిగే విధంగా కోళ్లకు అనుకూలంగా ఉంది. దీంతో త్వరగా వృద్ధి, బలంగా ఉంటున్నాయి. నీరు, ఆహారం లభించడంతో కోళ్లు త్వరగా ఎదుగుతున్నాయి.
రూ.10కు నాటు కోడి గుడ్డు..
మహదేవపూర్ కోళ్ల ఫారం వద్ద రూ.10కి నాటు కోడి గుడ్డు విక్రయిస్తున్నారు. అదే ఇతర ప్రాంతాల్లో అయితే రూ.15కి ఇస్తున్నారు. డెలివరీ కూడా త్వరలో ప్రారంభించనున్నారు. నాటుకోడి మాసం కేజీకి చొప్పున రూ.300 నుంచి 350కి ఫారం వద్ద విక్రయిస్తున్నాడు. సహజ ఆహారంతో స్వేచ్ఛగా తిరిగే కోళ్లు పెట్టే దేశీ గుడ్లు, సాధారణ గుడ్ల కంటే ఆరోగ్యకరమైనవి. వాటిలో అధిక ప్రొటీన్, ఒమేగా–3, విటమిన్లు ఏ, ఈ, బీ 12 ఉంటాయి. నాటుకోడి గుడ్లు బాగా రుచి, దృఢమైన ఆకృతిని అందిస్తాయి. కానీ ఖరీదైనవి తక్కువ అందుబాటులో ఉంటాయి. మాంసం, గుడ్లు పాలు వంటి జంతు ప్రోటీన్లు పూర్తి ప్రోటీన్లు, అంటే అవి మన శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. జంతు ఉత్పత్తులు అత్యున్నత నాణ్యత ప్రొటీన్ వనరులను అందిస్తాయి. చిన్నారులకు గుడ్లు తినిపిస్తే బలంగా తయారు అవుతారు.
పందెం కోళ్లతో పాటు
సోనా ఇతర ఫారం ఏర్పాటు
రూ.10నుంచి రూ.15లకు
నాటు కోడిగుడ్ల విక్రయాలు
మాంసంతో పోషకాలు, గుడ్లతో
పిల్లల ఎదుగుదలకు తోడ్పాటు
ఎకరం భూమిలో కోళ్ల ఫారం
భవిష్యత్‌లో నాటుకోడిగుడ్ల
డెలివరీకి శ్రీకారం
నాటు కోళ్లు.. డిమాండ్ బాగు!
నాటు కోళ్లు.. డిమాండ్ బాగు!


