ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరపాలి
భూపాలపల్లి అర్బన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్‌తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. కగార్ ఎన్‌కౌంటర్లపై అనేక అనుమానాలు ఉన్నాయని, మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లపై స్వయంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను కోర్టుకు సరెండర్ చేయకుండా టెర్రరిస్టుల మాదిరిగా చంపడం సరికాదన్నారు. మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని, తమ పంథా మార్చుకోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని.. ఇప్పటికే కొందరు బయటికి వచ్చారని, మిగిలిన వారు కూడా తమ పంథా మార్చుకొని కమ్యూనిస్టులతో కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, నాయకులు మోటపలుకుల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సోత్కు ప్రవీణ్‌కుమార్, మాతంగి రామచందర్, కొరిమి సుగుణ, నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గోలి లావణ్య, పొన్నగంటి లావణ్య పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు


