‘డబుల్’ లొల్లి
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరంలో భాస్కర్‌గడ్డ సమీపంలో 408 డబుల్‌బెడ్ ఇళ్ల సముదాయ నిర్మాణ పనులు ప్రారంభించి 2023లో పూర్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్ధిదారుల జాబితాను రూపొందించి డ్రా పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. ఎన్నిక కోడ్ అమలోకి రావడంతో ఇంటి పత్రాలను అందించలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పటి లబ్ధిదారుల జాబితాను రద్దు చేసింది. తమకు కేటాయించిన ఇళ్ల పత్రాలు ఇవ్వాలని పలుమార్లు లబ్ధిదారులు ఆందోళనలు, వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి సర్వే చేసి ఇళ్లు కేటాయిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానమిస్తూ రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేసి చివరి పాత జాబితాను పూర్తిగా రద్దు చేసి నూతన జాబితా ప్రకారం బుధవారం డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించి ధృవపత్రం అందించారు.
డబుల్‌బెడ్‌రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపించారు. కూలీ, ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసముంటున్నవారికి ఇళ్లు రాకపోవడంతో కంగుతిన్నారు. 2023 సంవత్సరంలో చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించి.. ప్రస్తుతం కేటాయించిన జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటికే సొంత ఇళ్లు, సింగరేణి ఉద్యోగం ఉన్నవారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారులు కేటాయించారు. జవహర్‌నగర్ కాలనీ, రాంనగర్, సుభాష్‌కాలనీ, పూల్లూరిరామయ్యపల్లి, బీసీ కాలనీ, హన్‌మాన్‌నగర్‌లో అధికంగా ఇళ్లు ఉన్న వారికి మళ్లీ ఇళ్లను కేటాయించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగిన అర్హులకు అందలేదని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అప్పటి జాబితాను రద్దు చేయించారు. అధికారులు పకడ్బందీగా అక్రమాలకు తావు లేకుండా ఇళ్ల కేటాయింపు జరగాలని ఆదేశించారు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు సర్వే, జాబితా ఎంపికపై కలెక్టర్ దృష్టి సారించలేదని జిల్లా కేంద్రంలో ప్రచారం జరుగుతోంది. ఓ ఇన్‌చార్జ్ జిల్లా ఉన్నతాధికారి అన్నీతానై వ్యవహారించినట్లు చర్చించుకుంటున్నారు. ఈ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం రెండు సంవత్సరాల పాటు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి నాలుగైదు సార్లు సర్వే చేశారు. సర్వేల పేరుతో కాలయాపన చేసి అర్హులకు న్యాయం చేయలేదు. పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడితో సదరు అధికారి జాబితాలో కొంత మంది అనర్హుల పేర్లను చేర్చినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌లు లబ్ధిదారుల జాబితాపై రహస్య విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని బాధితులు వేడుకుంటున్నారు.
అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తూ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న బాధితులు బుధవారం మంజూర్‌నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కక్ష్య పూరితంగానే కొంత మంది నాయకులు వారికి అనుకూలమైన వ్యక్తులకు ఇళ్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు కేటాయించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమ పేర్లను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం చేపడుతున్న బాధితులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో
నిర్మించిన 408 ఇళ్లు
ఇల్లు ఉన్న వారికే
కేటాయించారని ఆరోపణ
రహస్యంగా ఇళ్ల కేటాయింపునకు డ్రా
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళన
అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
‘డబుల్’ లొల్లి
‘డబుల్’ లొల్లి
‘డబుల్’ లొల్లి
‘డబుల్’ లొల్లి
‘డబుల్’ లొల్లి


