మొక్కజొన్న సాగుకు సన్నద్ధం!
రేగొండ: ఈ ఏడాది పత్తిని నమ్ముకుని సాగు చేసిన రైతులకు నిరాశే ఎదురైంది. తుపాను ప్రభావంతో దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో రైతులు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
జిల్లాలో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో అధిక వర్షపాతం నమోదు కావడంతో వర్షం నీరు అధికమై పత్తి పూర్తిగా దెబ్బతింది. సుమారు 50 శాతానికి పైగా దిగుబడి తగ్గిపోయింది. ప్రతీ సంవత్సరం దసరా పండుగ వరకు పత్తి పంట మార్కెట్లోకి వచ్చేది. కానీ ఈసారి దీపావళికి కూడా రాలేదు. దీంతో దిగుబడి ఏమేరకు తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన అన్నదాతకు రూ.10 వేలు కూడా చేతికందే పరిస్థితిలేదు.
జిల్లాలోని అనేక మంది రైతులు ప్రస్తుతం పత్తి పంటను తీసేసి మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 30 శాతం మంది రైతులు పత్తి పంట తొలగించారు. జిల్లాలో యాసంగిలో సుమారు 70వేల ఎకరాల్లో సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పత్తి పంటను తొలగిస్తున్న రైతులు
జిల్లాలో 70వేల ఎకరాల్లో
సాగు అంచనా


