నేటితో కార్తీకమాసం ముగింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం నెల ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. (నేడు) గురువారం అమావాస్యతో కార్తీకమాసం నెల ముగియనుండడంతో కాళేశ్వర ముక్తీశ్వరున్ని బుధవారం భారీసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గతేడాది ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల ద్వారా నెలరోజులకు గాను రూ.ఒక కోటి వరకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం బుధవారం వరకు రూ. 1.06కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీపథకంతో మహిళలు అధికంగా దర్శించుకున్నారు. గోదావరి, జ్వాలతోరణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, నందీశ్వరుడికి అభిషేకం, గోదావరికి హారతి, ఇతర పూజల్లోనూ భక్తులు పాల్గొన్నారు. ఒక్కో రోజు సుమారుగా 30–40 వేల మంది భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, గర్భగుడిలో దర్శనం చేసుకున్నారు. గతేడాది కంటే ప్రస్తుత మాసంలో రూ.6లక్షల వరకు ఆదాయం ఎక్కువగా వచ్చి కాస్త ఊరటనిచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.


