ధాన్యం ఆరేదెలా..
మూడేళ్లుగా నిలిచిన కల్లాల నిర్మాణం..
జిల్లా వివరాలు...
కలగా మిగిలిన కల్లాల నిర్మాణం
కాటారం: ఆరుగాలం శ్రమించి పంట సాగుచేసిన రైతులకు అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది. వరి పంట పండించడం ఒక ఎత్తయితే చేతికి వచ్చిన వరి ధాన్యం విక్రయించే తరుణంలో ఆరబెట్టడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తేమ 17 శాతం ఉంటేనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని రోజుల తరబడి తేమ శాతం అదుపులోకి వచ్చే వరకు ఆరబెట్టాల్సి వస్తుంది. ధాన్యం ఆరబెట్టడానికి సరైన ప్రదేశాలు లేక రైతులు రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
తేమ కష్టాలు..రైతుల ఇక్కట్లు..
జిల్లాలో వరి, పత్తి పంటలు రైతుల చేతికి వస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఏ పంటలోనూ ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం రావడం లేదు. సేకరించిన పంట ఉత్పత్తులను రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో టార్ఫాలిన్లపై పోసి ఆరబెడుతూ ఇబ్బందులు పడుతున్నారు. పంటలను రహదారులపై ఆరబోయడం వలన చీకటివేళలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పంట కల్లాలు నిర్మించుకుంటే ఈ ఇక్కట్లు ఉండేవి కాదు. సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మించిన కల్లాలపై ఆరబెడితే తేమ శాతం త్వరగా తగ్గి ప్రభుత్వ మద్దతు ధర లభించనుంది.
కష్టాలు తొలిగించేందుకు..
రైతులు తమ పంట దిగుబడులను ఆరబెట్టుకునేందుకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులను తీర్చాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పంట కల్లాల నిర్మాణాలకు చర్యలు తీసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణం చేపట్టారు. సొంత భూమి కలిగిన రైతులకు ఉపాధి హామీ ద్వారా ఇవి నిర్మించుకునే అవకాశం కల్పించారు. అప్పట్లో అధికారులు రైతులకు సరిగా అవగాహన కల్పించకపోవడం బిల్లులు అందడం లేదనే కారణంతో రైతులు ముందుకు రాకపోవడంతో జిల్లాలో కొంత మంది రైతులు మాత్రమే కల్లాలు నిర్మించుకున్నారు. జిల్లాలో 1309 డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాంలు మంజూరు కాగా కేవలం 340 మాత్రమే పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
వాహనదారులకు ఇబ్బందులు..
సరైన కల్లాల నిర్మాణం లేకపోవడంతో పలు మండలాల్లో ప్రధాన రహదారులపై రైతులు ధాన్యం ఆరబోసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలను గమనించక ప్రమాదాల భారిన ఘటనలు లేకపోలేదు.
మండలాలు 12
గ్రామాలు 241
వరి సాగు 1,11,230 ఎకరాలు
పత్తి సాగు 98,780 ఎకరాలు
రైతులు 98,560
రైతుల ఆరబోత కష్టాలను తొలగించేందుకు గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో కల్లాల (డ్రై యింగ్ ఫ్లాట్‌ఫాం) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూడు సంవత్సరాలుగా కల్లాల నిర్మాణానికి బ్రేక్‌పడింది. రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు కారణాలు చెప్పడంతో ప్రభుత్వాలు ఆ పథకాన్ని నిలిపేశాయి. అనంతరం అనేక మంది రైతులు కల్లాల నిర్మాణం ప్రాముఖ్యత తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కల్లాల నిర్మాణం కోసం తిరిగి అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రోడ్లు, ఖాళీ ప్రదేశాలే దిక్కు..
ధాన్యం ఆరబెట్టడానికి అష్టకష్టాలు
ఏళ్ల తరబడి అన్నదాతల అరిగోస


