పథకాలపై నిరంతర పర్యవేక్షణ
భూపాలపల్లి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు, దిశా కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని అధికారులకు సూచించారు. జిల్లా విద్యా హబ్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్య, వైద్య సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. సింగరేణి సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులు ప్రాథమిక పనులకు ఇవ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, డీఆర్‌డీఓ బాలకృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, కెటీపీపీ సీఈ ప్రకాశ్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
దిశా కమిటీ సమావేశంలో
ఎంపీ కడియం కావ్య


