నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
నేడు ఎంపీ కావ్య రాక..
భూపాలపల్లి: జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించడానికి ఆరోగ్య సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో సోమవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్స్ నమోదు ప్రక్రియలను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోగుల భద్రత, వైద్య నైతిక విలువలు, అవసరమైన సిబ్బంది, పరికరాలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు లేదా వైద్య సదుపాయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి..
ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంజూరునగర్‌లో ఇండియా బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ తప్పనిసరి..
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు నమోదుపై ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సమస్యలు పరిష్కరించాలి...
ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పిస్తున్నారని.. ఆ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్యాల మండలం ఏఆర్ పల్లి గ్రామానికి చెందిన ఐలమ్మ లోకోమోటర్ వ్యాధితో బాధపడుతూ నడవలేకపోతున్నానని, తనకు వీల్‌చైర్ ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సదరు మహిళకు వీల్‌చైర్ మంజూరు చేయాలని మహిళా సంక్షేమ అధికారిని ఆదేశించారు.
మెరుగైన బ్యాంకింగ్ సేవలు ఇవ్వాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో నేటి ఉదయం 10 గంటలకు దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ బాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.


