ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వ తేది వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12వ తేది వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30వ తేదీలోపు చెల్లించాలన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం పాలకమండలికి దేవాదాయశాఖ రీ నోటిఫికేషన్ వేసినట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పలుమార్లు పాలకమండలికి నోటిఫికేషన్ వేయగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో మరోసారి 14మంది డెరెక్టర్లు, ఒక ఎక్స్‌అఫీషియో సభ్యులకు (అర్చక) నోటిఫికేషన్‌ను ఆ శాఖ కమిషనర్ ఆదేశాలతో వేశారు. ఈ నోటిఫికేషన్ వెలుబడిన 20 రోజుల్లో ఆశావహులు వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సారైనా పాలకమండలి నియామకం జరుగుతుందా లేదా అని ఆశావహులు చర్చించుకుంటున్నారు.
భూపాలపల్లి అర్బన్: ఈనెల 23న జిల్లాలో నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి, కాటారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు ఒక గంట ముందు హాజరుకావాలని సూచించారు. క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదని చెప్పారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.
భూపాలపల్లి రూరల్: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21న జిల్లా కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య, ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో కర పత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక జిల్లా చైర్మన్ చిలుకల పాణి, సంఘం నాయకులు సాదా మల్లయ్య, చాడ కిష్ట స్వామి, సాంబయ్య, మారబోయిన ధనుంజయ, పిట్టల కేశవులు, మండలాల అధ్యక్షులు బోయిని సాంబయ్య, బంటు రమేష్, మొగిలి, కుమార్, సమ్మయ్య పాల్గొన్నారు.
కాటారం: జాతీయ స్థాయి అండర్ 17 విభాగం హ్యాండ్‌బాల్ పోటీలకు మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు. ఈ నెల 7నుంచి 9వరకు మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారుడు అజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27నుంచి 30వరకు కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అజయ్ పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి జైపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడి మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, హర్షం వ్యక్తం చేశారు.
ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు


