మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని మెడికల్ షాపులలో జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి పావని సోమవారం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు షాపులకు నోటీసులు జారీచేశారు. అనంతరం పావని మాట్లాడుతూ.. గర్భస్రావానికి సంబంధించిన, మత్తు అలవాటు కలిగించే మందులను, యాంటిబయోటిక్స్‌ను అర్హత గల వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సేల్ బిల్ తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త జీఎస్టీ ధరల ప్రకారం అమ్మకపు బిల్లు ఇవ్వాలని సూచించారు.


