సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కాటారం: మండలకేంద్రంలోని ఇప్పలగూడెంలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల ప్రారంభించారు. రూ.10 లక్షల సీఆర్‌ఆర్ నిధుల ద్వారా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని ప్రతి కాలనీలో సీసీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్‌బాబు అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో వైద్య, విద్య, తాగునీరు, రవాణా అందించడమే ధ్యేయంగా మంత్రి శ్రీధర్‌బాబు ముందుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చినాల బ్రహ్మారెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ జాడి మహేశ్వరి, నాయకులు చీమల రాజు, ఆత్మకూరి కుమార్‌యాదవ్, జాడి రమేశ్ పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
రేగొండ: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను కొత్తపల్లిగోరి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గణపురం సీఐ కరుణాకర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ములుగు జిల్లా అబ్బాపూర్ గ్రామపంచాయతీ శివారులోని ఓ మిల్లులో బిహార్‌కు చెందిన చోటు కుమార్, కుందన్ కుమార్, సంతోష్ కుమార్ హమాలీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) లోని కెనాల్ వద్దకు గంజాయి తీసుకువచ్చారు. పక్కా సమాచారం మేరకు ఎస్సై దివ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి 2.3 కిలోల గంజాయి, 53 గంజాయి చాక్లెట్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
కిక్కిరిసిన భక్తజనం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం


