వామ్మో కూరగాయలు
● మోంథా తుపాను ప్రభావంతో
పెరిగిన ధరలు
● బెంబేలెత్తుతున్న సామాన్యులు
● పేద, మధ్య తరగతిపై అదనపు భారం
కాటారం: మోంథా తుపాను వ్యవసాయరంగానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. వాణిజ్య పంటలతో పాటు కూరగాయల సాగుపై సైతం ఎనలేని ఎఫెక్ట్ పడింది. మోంథా తుపానుతో పాటు కార్తీకమాసం ప్రభావంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరల తోటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయ కొందామన్న కిలో రూ.100 చేరువలో ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పది రోజుల్లోనే కూరగాయలు, ఆకుకూరల ధరలు రెట్టింపు కావడంతో ఆర్థిక భారం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల్లో రెండింతలు
కూరగాయలు, ఆకుకూరల ధరలు పది రోజుల్లో రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కూరగాయ కొన్నా కిలో రూ.100 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ తారుమారవుతోంది. కొన్ని రోజుల క్రితం రూ.20కే కిలో అమ్మిన టమాట, ఆలుగడ్డలు నేడు రూ.50 నుంచి రూ.60కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, సోరకాయ, వంకాయ, బీర వంటివి కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇక బీన్స్, చిక్కుడు, మునగ వంటివి కిలో వంద దాటి పోయాయి. దీంతో పేదలు కూరగాయల కొనుగోలు తగ్గించేశారు. రోజుకు రెండు కూరలు వండే వారు ఒక దానితోనే సరిపెట్టుకుంటున్నారు. మిగతా పూటలు పచ్చడి, పప్పుచారుతో ఒడ్డెక్కిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగానే..
జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు లేదు. దీంతో నిత్యం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. మోంథా తుపాను, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో సాగుచేస్తున్న కూరగాయలు, ఆకుకూరల పంటలు పూర్తిస్థాయిలో పాడైపోవడంతో దిగుబడి తగ్గి ధర పెరిగిందని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా అంతంతమాత్రంగానే జరుగుతుండటంతో కూరగాయలు సరిపోక ధరలు ఒక్కసారిగా పెరిగాయని పేర్కొంటున్నారు. స్థానికంగా కూరగాయలకు అధిక డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు.
కార్తీకమాసం ఎఫెక్ట్..
కూరగాయల ధరలు పెరగడానికి మోంథా తుపాన్ ఓ కారణంగా కాగా కార్తీక మాసం ఎఫెక్ట్ సైతం అదే స్థాయిలో ఉంది. గత నెల 22 నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో పూజలు, వ్రతాలు ఆచరిస్తూ పూర్తిగా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయ్యప్ప, భవానీ, ఆంజనేయ స్వామి మాలాధారణలకు కూడా సమయం కావడంతో అధిక శాతం ప్రజలు వెజిటేరియన్ భోజనం చేస్తున్నారు. దీంతో కూరగాయలు, ఆకుకూరలకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు మండుతున్నాయి. ఏది కొనాలన్న కిలో రూ.100కు చేరువలో ఉండటంతో మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండటం లేదని మధ్యతరగతి ప్రజలు తలపట్టుకుంటున్నారు.
కొనలేకపోతున్నాం..
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు చూస్తే కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పది రోజులుగా కూరగాయలు, ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కూరగాయలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి వస్తోంది. వారంలో నా లుగు రోజులు పప్పులతో వెల్లదీయాల్సి వస్తోంది.
– శాంత, గృహిణి, టేకుమట్ల
వామ్మో కూరగాయలు


