బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
● జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి
కాటారం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేసి బాలికలకు ఉజ్వల భవిష్యత్ అందించాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కాటారం మండలం మేడిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, బాలికల రక్షణ తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ బాలికలు ఉన్నత చదువులు చదివి జీవితంతో రాణించాలని సూచించారు. బాల్య వివాహాలు, చెడు మార్గాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ చూపాలని తెలిపారు. బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చాయన్నారు. అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ రాధిక, సీహెచ్‌ఎల్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, అనూష, పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


