నష్టం 481 ఎకరాలేనట!
● వేలాది ఎకరాలను ముంచిన
మోంథా తుపాను
● పూర్తిస్థాయిలో పరిశీలించని అధికారులు
● ఆందోళనలో అన్నదాతలు
భూపాలపల్లి: మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునగగా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయలేదు. నామమాత్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఫలితంగా పంటలు నీట మునిగిన రైతులు కనీస ప్రభుత్వ సహాయాన్ని అందుకోలేకపోతున్నారు.
ప్రాథమిక అంచనా 3,704 ఎకరాలు..
తుపాను కారణంగా జిల్లాలో గత నెల 29, 30వ తేదీల్లో వర్షాలు కురిసి పత్తిపంటలు దెబ్బతిన్నగా.. వరి నీట మునిగింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంటనష్టం అంచనా వేశారు. జిల్లాలోని ఆరు మండలాల్లో 2,524 మంది రైతులకు చెందిన 3,704 ఎకరాల పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అనంతరం నామమాత్రపు సర్వే, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కేవలం 481 ఎకరాల్లోనే పంటనష్టం జరిగినట్లుగా ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు.
పత్తి, మిర్చి ఊసే లేదు..
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న వరి పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నష్టం భారీగా తగ్గినట్లుగా సమాచారం. వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి పంటలను సర్వే చేయకపోగా, నష్టం నమోదు చేయలేదని ఓ మండల వ్యవసాయాధికారి తెలిపారు. ఉద్యాన పంటల నష్టం కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. పంటలు నష్టపోయిన రైతులు నేటికీ రైతు వేదికల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పంటలను పరిశీలించి తమ పేర్లు సర్కారుకు పంపాలని కోరుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు.
నివేదిక పంపించాం..
మోంథా తుపాను వలన జిల్లావ్యాప్తంగా 481 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా అంచనా వేశాం. ఈ మేరకు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించాం.
– బాబురావు, జిల్లా వ్యవసాయ అధికారి


