గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని.. విద్య వికాసానికి మూలమని అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 58వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెగ్యులర్‌గా గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తానని, అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కోసం రూ.10 లక్షల రూపాయలు తన నిధుల నుంచి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాశీంపల్లిలో జరిగిన నూతన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. భూపాలపల్లి పట్టణంలో నేరాలు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాశీంపల్లి ప్రాంతంలో పోలీసుల సూచన మేరకు ఏర్పాటుచేసిన 16 నూతన కెమెరాలు పోలీసులు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. ప్రతి వీధి మూలలో భద్రతా వలయం ఏర్పడి ప్రజలు నిశ్చింతగా జీవించేందుకు ఇవి తోడ్పడుతాయన్నారు. భవిష్యత్‌లో కూడా పట్టణ అభివృద్ధికి, భద్రతా ప్రమాణాల పెంపునకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సహకారం ఉంటే భూపాలపల్లిని పూర్తిగా స్మార్ట్ అండ్ సెక్యూర్ టౌన్‌గా అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి సీఐ నరేష్, భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


