ఏసీబీ తనిఖీలు
భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తన టీంతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆకస్మికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని తనిఖీలు ప్రారంభించారు. కంప్యూటర్‌లో పొందుపరిచిన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీ సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ.. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు నేరుగా వచ్చి సబ్ రిజిస్ట్రార్ వద్ద హాజరు కావాలన్నారు. ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఇందుకు భిన్నంగా ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్‌లను లోపలికి అనుమతిస్తున్నట్లు గుర్తించామన్నారు. రిజిస్ట్రేషన్ అయిన తరువాత డాక్యుమెంట్లను సంబంధిత భూ యజమానికి మాత్రమే అప్పగించాల్సి ఉండగా, డాక్యుమెంట్ రైటర్లే సంతకాలు చేసి తీసుకుంటున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ విచారణలో వెల్లడైన పూర్తి అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు తెలియజేయాలని డీఎస్పీ సాంబయ్య సూచించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎల్ రాజు, ఎస్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


