వామ్మో.. చలి!
రైతులకు తిప్పలు..
రాత్రివేళ పడిపోతున్న
ఉష్ణోగ్రతలు
కాళేశ్వరం వద్ద చలికి తట్టుకోలేక మంటలు కాగుతున్న భక్తులు
కాళేశ్వరం: జిల్లాలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి తీవ్రత పెరుగుతుంది. గతేడాదితో పోల్చి చూస్తే చలి తీవ్రత పెరిగింది. దీంతో అటవీ ప్రాంత గ్రామాలు చలిదెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ఉదయం పదిన్నర గంటలైనా జనం రోడ్డెక్కని పరిస్థితి నెలకొన్నది. అటవీ గ్రామాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మధ్యలో తుపాన్ ప్రభావంతో కొన్ని రోజులు కాస్త చలి తీవ్రత తగ్గినప్పటికీ నాలుగైదు రోజుల్లో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగింది. నాలుగు రోజులుగా 14 నుంచి 16 డిగ్రీ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనం రోడ్లపై తిరగడం లేదు.
గ్రామాల్లో ఇలా..
జిల్లాలోని 12 మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు, రైతు కూలీలు రోజు వారి పనులు చేసుకునేందుకు కూడా బయటకు రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా టేకుమట్ల, రేగొండ, పలిమెల, మహాముత్తారం, కాటారం, మల్హర్, మహదేవపూర్ వంటి మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువ నమోదవుతున్నాయి. పొగ మంచు కూడా విపరీతంగా కురుస్తుండడంతో చర్మ సంబంధ వ్యాధుల బారిన పడి చికాకులు ఎదుర్కొంటున్నారు.
ఉదయం వేళల్లో పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలకు గాలిలో తేమ కారణంగా శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పత్తి తీసే సీజన్ కావడంతో రైతు కూలీలు పనులకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా కూలీలు వ్యవసాయ క్షేత్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయంత్రం అయిదు గంటల వరకు పనిచేస్తారు. తాజా పరిస్థితులతో పది, పదిన్నర గంటలు దాటితే తప్ప కూలీలు చేలకు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా చలిదెబ్బకు తమ ప్రయాణాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు. ఉదయం తొమ్మిది, పది గంటలు దాటితే తప్పా కూరగాయల మార్కెట్‌లలో ప్రజలు కనిపించడం లేదు. దాంతో చిరు వ్యాపారులు గిరాకీలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చలితో పాటు చల్లటి గాలుల ప్రభావం
గజగజ వణుకుతున్న జనం
వృద్ధులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై
తీవ్ర ప్రభావం
ప్రత్యామ్నాయాలపై
దృష్టిసారించిన ప్రజలు
రైతులకు తప్పని తిప్పలు
వ్యాధులతో అప్రమత్తం..
ఓ వైపు చలితో పాటు మరో వైపు చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు దగ్గు, దమ్ము, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దగ్గు, దమ్ము, ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిసింది. వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ప్రత్యమ్నాయాలపై దృష్టి సారించారు. వారం రోజులుగా అధికంగా దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. ఉపశమనం కోసం కొన్నిచోట్ల మంటలు కాగుతున్నారు. వెచ్చని పానియాలు, వేడి ఆహార పదార్థాలు తింటున్నారు. రగ్గులు, స్వెటర్లు, ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరిగింది.
వామ్మో.. చలి!
వామ్మో.. చలి!


