నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
భూపాలపల్లి రూరల్: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నేటి (శుక్రవారం) నుంచి జిల్లా గ్రంథాలయంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల/పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, రంగోళి, పాటలు తదితర పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో జిల్లాలోని ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఉద్యోగులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి కార్పొరేట్ ఐటీ డిపార్ట్‌మెంట్ డీజీఎం శ్రీనివాస్ సూచించారు. సింగరేణి వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు గురువారం జీఎం ఆఫీస్‌లో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్పొరేట్ ఐటీ డిపార్ట్‌మెంట్ డీజీఎం శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, పిన్ కోడ్, ఓటీపీలు చెప్పకూడదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, జోతి, రవికుమార్, అన్ని గనుల అధికారులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నేబోయిన తిరుపతి కోరారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మూడు దశల ఆందోళన పోరాట కార్యక్రమాలలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర వేతనాలతో వెట్టిచాకిరికి గురవుతున్న కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి, టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బానోత్ సేవ నాయక్, జగపతిరావు, భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాజరత్నం, సుశీల, శ్రీహరి, సంతోష్, కరణ్ సింగ్, లక్ష్మినారాయణ, పాల్తీయ, కిషన్ పాల్గొన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలోని నందీశ్వరుడికి అభిషేక పూజలను ఈనెల 17న సోమవారం సాయంత్రం (ప్రదోశకాలం) కార్తీకమాసం సందర్భంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శనిగెల మహేష్ గురువారం తెలిపారు. నందీశ్వరుడికి అభిషేక పూజ చేసినవారికి జాతకం వలన పట్టి పీడిస్తున్న బాధలు తొలిగిపోతాయని ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మంత్రికి ఆహ్వానం..
నందీశ్వర అభిషేకం కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును దేవస్థానం ఈఓ మహేష్, ఆలయ ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ ఆహ్వానించారు. గురువారం కాటారం మండలం ధన్వాడలో మంత్రిని వారి ఇంటి వద్ద కలిశారు. ఆలయంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న నందీశ్వర అభిషేక పూజలకు రావాలని ఆహ్వానం అందజేశారు.
ములుగు రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు గురువారం మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. వంట కార్మికులను తొలగించి హరేరామా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దీనివల్ల వేలాది మంది వంట కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


