నాణ్యమైన బొగ్గును అందించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ సంస్థలకు నాణ్యమైన బొగ్గును అందించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో నాణ్యతకు సంబంధించిన జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ 135 సంవత్సరాలుగా దేశ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తూ అగ్రగామిగా ఉందన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో విద్యుత్ సంస్థల పురోగతి సింగరేణి సరఫరా చేసే బొగ్గు నాణ్యతపై ఆధారపడి ఉందని తెలిపారు. వినియోగదారుడి మనుగడపైనే మన మనుగడ ఆధారపడి ఉందిశ్రీ అనే సూత్రంతో ప్రతి సింగరేణీయుడు నాణ్యత పెంపుదలలో కృషి చేయాలని సూచించారు ఇతర ప్రైవేట్ కంపెనీలు తక్కువ ధరలకు బొగ్గు విక్రయిస్తున్న నేపథ్యంలో, సింగరేణి తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని, నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరగడంతో పాటు తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, క్వాలిటీ ఇన్‌చార్జ్ కృష్ణ ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్, మేనేజర్ రామకంఠ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బొగ్గు నాణ్యత వారోత్సవాలు


