అభివృద్ధి పనుల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: స్టడీటూర్‌లో భాగంగా నూతన ట్రైనీ ఐఏఎస్ అధికారులు బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను పరిశీలించి ఇతర కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పురపాలక సంఘ కార్యాలయ పరిధిలోని డ్రై రిసోర్సెస్ సెంటర్ (డీఆర్‌సీసీ), వెస్ట్ కంపోస్ట్ షెడ్డు, డంప్ యార్డులను పరిశీలించి అక్కడ జరిగే పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో సీఆర్‌సీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జంగేడు కేజీబీవీలోని పాఠశాల, జూనియర్ కళాశాలలను పరిశీలించి విద్యార్థులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సునీల్‌కుమార్, మానస, అశోక్‌కుమార్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ బి. రాజేశ్వరి, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారుల పర్యటన
కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం ములుగుపల్లిలో మూడురోజులుగా కొనసాగుతున్న కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పర్యటన బుధవారం ముగిసింది. చివరి రోజులో భాగంగా బృందం సభ్యులు స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయుల సంఖ్య, బోధన, వసతులు, పాఠశాల నిర్వాహణపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిశాంత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని ట్రైనీ ఐఏఎస్‌ల బృందం దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి రాగా అర్చకులు, అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద వారిని అర్చకులు స్వామివారి కండువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు.


