ఐటీడీఏను తరలిస్తే ఊరుకోం..
● తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మహేష్
ఏటూరునాగారం: ఐటీడీఏను తరలిస్తే ఊరుకునేది లేదని నిరసనగా ఐటీడీఏను ఈ నెల 24న ముట్టడిస్తామని తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షుడు చందా మహేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భవనం నిర్మాణం పేరుతో మరో చోటుకు తరలించాలని చూడడం సరికాదన్నారు. అలా చేస్తే కార్యాలయం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆకులవారిఘనపురంలో ఆదివాసీల ఉనికి కనుమరుగు చెసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఐటీడీఏ భవనం కొమురం భీమ్ మినీ స్టేడియంలో నిర్మించాలని చూస్తున్నారన్నారు. ఏజెన్సీలో ఉన్న ఏకై క క్రీడాప్రాంగణం భవన నిర్మాణంకు ఉపయోగిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్రీడలు దూరం చేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఐటీడీఏ తరలింపును ఆలోచన విరమించుకోవాలన్నారు. ప్రస్తుతం ఐటీడీఏ ఉన్న స్థలంలోనే భవనం నూతనంగా నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్, సమ్మయ్య, నర్సింహులు, రాజు పాల్గొన్నారు.


