వృథా వస్తువులను వినియోగిస్తే ప్రయోజనం
ఎన్‌జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్
కాటారం: వృథాగా మారిన, పనికిరాని వస్తువులను సక్రమంగా వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం సమకూర్చుకోవచ్చని ఎన్‌జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. కాటారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల డివిజన్ స్థాయి వేస్ట్ టూ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల నుంచి సుమారు 23 పాఠశాలల విద్యార్థులు వేస్ట్ పదార్థాలతో పనికి వచ్చే వస్తువులు, అలంకరణ కోసం ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ప్రదర్శించారు. పలు పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన వస్తువులను ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిశీలించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల్లో, ఇంట్లో ఏర్పడే చెత్త, ఈ వేస్ట్ నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వేస్టేజీ నిర్వహణతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం సంపాదించే మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలిచిన మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల విద్యార్థినులు రూ.3వేలు, కాటారం ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి రూ.2 వేలు, గుడ్ మార్నింగ్ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచి రూ.వెయ్యి నగదు, బహుమతులు గెలుచుకున్నారు. కాటారం మాంటిస్సోరి పాఠశాల, చింతకాని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, కాటారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఎంఈఓ శ్రీదేవి, హెచ్‌ఎంలు సోమలింగం, ఎఫ్‌పీఎస్‌టీ జనరల్ సెక్రటరీ గండు రాజబాబు పాల్గొన్నారు.


