రెండో రోజు పర్యటన
కాటారం(మహాముత్తారం): కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల బృందం రెండో రోజు మంగళవారం మహాముత్తారం మండలం ములుగుపల్లిలో క్షేత్రస్థాయి పర్యటన కొనసాగింది. ఉద్యోగుల బృందం సభ్యులు గ్రామంలో శ్రమదానం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరుపై ఆరాతీశారు. హెల్త్ సబ్‌సెంటర్‌లో సౌకర్యాలను చూసి సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చటించి సంఘాల నిర్వహణ తీరు, రుణాల మంజూరు, స్వయం ఉపాధి గురించి చర్చించారు. సెగ్రిగేషన్ షెడ్‌ను పరిశీలించి తడి, పొడి చెత్త సేకరణ, కంపోస్టు ఎరువు తయారీ, గ్రామంలో కొనసాగుతున్న ఎఫ్‌పీఓ, సీఎస్సీ కేంద్రం నిర్వహణపై వివరాలు సేకరించారు. రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి జీవనశైలి, విధివిధానాలు, ప్రధాన పంటల సాగుపై చర్చించారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా గ్రామస్తులతో కలిసి ఉద్యోగుల బృందం సభ్యులు బతుకమ్మ ఆడారు. బృందం వెంట ఎంపీడీఓ సుశాంత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్‌రెడ్డి ఉన్నారు.


