
లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర చేస్తుందని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గత సంవత్సరం రూ.4,701 కోట్ల లాభం వచ్చినా యాజమాన్యం కేవలం రూ.2,412 కోట్లను మాత్రమే చూపించి కార్మికులకు 33శాతం వాటా ఇచ్చి అన్యాయం చేసినట్లు ఆరోపించారు. సింగరేణి ఆడిట్ వివరాలు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నారని.. దీనిపై కార్మిక వర్గంలో అనేక అనుమానాలు దాగి ఉన్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోపు సింగరేణి లాభాలు 35శాతం వాటా ఇవ్వాలని లేనిపక్షంలో సింగరేణిని స్తంభింపజేస్తామని హెచ్చరచించారు. ఈ సమావేశంలో నాయకుల వెలబోయిన సుజేందర్, మల్లేష్, నర్సింగరావు, సదానందం, శ్రీనివాస్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.