
బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
పోషణ మాసోత్సవాలు..
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అక్టోబర్ 2న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగే వేడుకలకు సాంస్కృతిక సారధి కళాకారులతో కళాజాతా నిర్వహించాలని డీపీఆర్‌ఓను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి ఎస్‌వోటు జీఎం కవీంద్ర పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్‌హాల్‌లో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తుదారుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకొని 70 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛతలో ఆదర్శంగా నిలవాలి..
ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి పట్టణం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగనున్న స్వచ్ఛత హీ సేవ–2025 కార్యక్రమాలపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని తెలిపారు.
పోషణ మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలపై మహిళా సంక్షేమశాఖ, వైద్య, విద్య, డీఆర్‌డీఓ, మెప్మా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతి రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషణపై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.