
యూరియా కోసం యుద్ధం
రేగొండ: రోజులు గడుస్తున్నా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తీరడం లేదు. పనులు మానుకుని తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ 550, గ్రోమోర్ 250, దమ్మన్నపేట రైతు వేదికలో 220 యూరియా బస్తాలు రాగా రైతులు వేలసంఖ్యలో ఎగబడ్డారు. దీంతో పోలీసుల జోక్యంతో పంపిణీ చేయాల్సి వచ్చింది.
నిరాశలో రైతులు..
23 పంచాయతీలకు మండలకేంద్రంలోని పీఏసీఎస్, గ్రోమోర్ కేంద్రాలలోనే యూరియా అందిస్తున్నారు. యూరియా సరఫరా చేస్తున్న విషయం తెలిసిన వెంటనే రైతులు ప్రైవేట్ వాహనాలు కిరాయి తీసుకుని మండలకేంద్రానికి వచ్చారు. 1000 మంది క్యూలో ఉంటే 400–500 మందికి మాత్రమే ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి పంపారు. దీంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు.
నేను ఏడెకరాల్లో పత్తి, ఒక ఎకరంలో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం పంట ఎదుగుదల కోసం యూరియా ఇవ్వాల్సి ఉంది. కానీ రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడంతో నేను, నా భర్త పొద్దున లైన్‌లో నిల్చుంటే మధ్యాహ్నం వరకు చెరొకటి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. కానీ అవి సరిపోవు. ప్రభుత్వానికి ముందు చూపు లేక యూరియా కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. రైతులకు సరిపడా యూరియా సరఫరా అయ్యేలా చూడాలి.
– పోషమ్మ, మహిళా రైతు, రేగొండ
రేగొండ మండలంలో యూరియా కొరత లేదు. రైతులు అవసరం మేరకు తీసుకుంటే సమస్య ఏర్పడే పరిస్థితి ఉండదు. అంతకుమించి అదనంగా అడగడంతోనే సమస్యలు వస్తున్నాయి.ఆలస్యమైనా ప్రతీ రైతుకు యూరియా అందజేస్తాం.
– పెద్ది వాసుదేవారెడ్డి, ఏఓ, రేగొండ
●
ఒక్క బస్తా కోసం
తెల్లవారుజామునుంచే పడిగాపులు
పంటలను బతికించుకునేందుకు రైతుల తిప్పలు
సొసైటీ కేంద్రాల వద్ద బారులు

యూరియా కోసం యుద్ధం

యూరియా కోసం యుద్ధం