
లాభాల వాటా చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు 35శాతం లాభాల వాటా చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకుముందు జరిగిన స్ట్రక్చర్ మీటింగ్‌లో జరిగిన ఒప్పందాలను పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సీఎండీ స్థాయిలో స్ట్రక్చర్ కమిటీని బహిష్కరించినట్లు చెప్పారు. సంవత్సర కాలంగా గుర్తింపు కార్మిక సంఘంగా పలు కార్మిక సమస్యలపై రెండుసార్లు డైరెక్టర్, సీఎండీతో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వాటిపై కీలక నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటికీ ఆ సమస్యల పట్ల సర్క్యులర్‌లు జారీచేయకుండా జాప్యం చేస్తుందన్నారు. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మిక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి మీటింగ్‌లో మారుపేర్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం వాటి అమలుకు అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని దాటవేస్తూ కనీసం సమస్య పరిష్కారం కోసం సర్క్యులర్‌లు కూడా ఇవ్వకుండా బాధిత కార్మికులను మోసం చేస్తుందన్నారు. సొంత ఇంటి పథకం కింద కమిటీ వేసి విధివిధానాలు ప్రకటించి అందుకు అనుగుణంగా అమలు పరుస్తామని తెలిపిన యాజమాన్యం కనీసం కమిటీలో సభ్యులను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్, నాయకులు చంద్రమౌళి, దేవా, గణేష్, స్వామి, మల్లేష్ పాల్గొన్నారు.